Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తేందుకు ఏపీ అధికారుల యత్నం.. తెలంగాణ అధికారులు అడ్డగింత

నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తేందుకు ఏపీ అధికారుల యత్నం.. తెలంగాణ అధికారులు అడ్డగింత

వార్త 3 weeks ago

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ మొదలయ్యాయి. సాగర్ కుడికాలువ గేట్లను ఎత్తి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు చేపట్టిన యత్నాన్ని తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా ప్రతిఘటించారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ఆదేశాలు లేకుండా గేట్లు ఎలా తెరుస్తారంటూ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గేట్ల ఎత్తివేతపై ఇరు రాష్ట్రాల వాదనలు

బుధవారం ఉదయం సుమారు 11:10 గంటల ప్రాంతంలో ఏపీ జలవనరుల శాఖ సిబ్బంది కుడికాలువ గేట్లు తెరిచేందుకు రంగంలోకి దిగారు. తమ ప్రాంత తాగునీటి అవసరాల కోసమే నీటిని మళ్లించుకుంటున్నట్లు వారు సమర్థించుకున్నారు. అయితే, బోర్డు అనుమతి లేకుండా ఏకపక్షంగా నీటిని తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ ఇంజనీర్లు తేల్చిచెప్పడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది.

Nagarjuna Sagar: ప్రత్యామ్నాయ మార్గంలో ఏపీ నీటి మళ్లింపు.. తెలంగాణ కౌంటర్

ప్రత్యక్షంగా గేట్లు ఎత్తడం కుదరకపోవడంతో ఏపీ వర్గాలు వెంటనే మరో మార్గాన్ని ఆశ్రయించాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 535 అడుగుల మేర నీటిమట్టం ఉండటంతో, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఆరంభించి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని తమ కాలువకు మళ్లించుకున్నాయి. దీనికి దీటుగా స్పందించిన తెలంగాణ అధికారులు వెంటనే అప్రమత్తమై, సాగర్ ఎడమ కాలువ గేట్లను తెరిచి సమానంగా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

కేఆర్ఎంబీకి ఫిర్యాదుకు సిద్ధమైన తెలంగాణ

ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై స్పష్టమైన ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఏకపక్ష ధోరణితో నీటిని తీసుకోవడంపై తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గురువారం అధికారికంగా కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, గతంలో 2023 నవంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే.

సూర్యాపేట బస్సు ప్రమాదం పై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha