Sonam Wangchuk : లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ రక్షణలు కల్పించాలని కోరుతూ గతేడాది జరిగిన నిరసనల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లద్దాఖ్‌లో తలెత్తిన అల్లర్లు, పౌరుల మరణాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ హింసాత్మక ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే స్థానిక యువత ఉద్యమించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎన్‌కౌంటర్ చేసినా సిద్ధమే’ – వాంగుక్ ఆవేదన
లద్దాఖ్ ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తున్నందుకే గతంలో తనను జైలుకు పంపారని గుర్తుచేసిన వాంగుక్, ఇప్పుడు నన్ను అణచివేసేందుకు ఎన్‌కౌంటర్ చేసినా చేయవచ్చని వ్యాఖ్యానించారు. “నన్ను ఎన్‌కౌంటర్ చేసినా పర్వాలేదు, కనీసం ఆ రకమైన త్యాగంతోనైనా ఈ దేశం మేల్కొంటుంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం విన్పిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. లద్దాఖ్ ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

