Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవంబర్ నుంచి కరెంట్ బిల్లుల మోత?

నవంబర్ నుంచి కరెంట్ బిల్లుల మోత?

వార్త 2 weeks ago

Telangana electricity:తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై రూ.5,420.23 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోళ్లకు అయిన అదనపు వ్యయం, పెరిగిన రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు డిస్కంలకు ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు పెరగడం వల్ల లేదా అంచనా వేసిన రాబడి కంటే తక్కువ ఆదాయం వచ్చిన సందర్భాలలో డిస్కంలకు లోటు ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఆర్థిక లోటును లేదా అదనపు వ్యయాన్ని పూడ్చుకోవడానికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో అమలు చేసే చట్టబద్ధమైన సర్దుబాటు ప్రక్రియనే ట్రూ-అప్ అంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5,186.29 కోట్లు, 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.2,448.93 కోట్ల లోటును కలిపి మొత్తం రూ.7,635.22 కోట్ల వసూలుకు డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల వాటాను నేరుగా వినియోగదారులపై మోపరాదని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానం అమలవుతున్నందున ఈ మొత్తాన్ని డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే సబ్సిడీ రూపంలో తీసుకోవాలని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ రంగానికి ఊరట లభించగా మిగిలిన రూ.5,420.23 కోట్ల భారాన్ని వ్యవసాయేతర, గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతినిచ్చింది.

Read also: Mahalakshmi Free Bus: ఫ్రీ బస్‌తో మహిళల ప్రయాణాలు జోరు.. మూడు నెలల్లో 35.65 కోట్ల ట్రిప్పులు

 Current bills… True up charges

నవంబర్ నుంచి బిల్లులలో అదనపు వసూళ్లు

ఈ ట్రూ-అప్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా, దీర్ఘకాలిక ప్రాతిపదికన వసూలు చేయాలని ఈఆర్‌సీ నిర్ణయించింది. రాబోయే నవంబర్ నెల కరెంట్ బిల్లు నుంచి ఈ సర్దుబాటు ప్రారంభమవుతుంది. మొదటి నెల నవంబర్ బిల్లులో యూనిట్‌కు అదనంగా 30 పైసలు, ఆ తర్వాతి నెల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) పరిధిలోని ప్రాంతాల్లో 29 నెలల పాటు, ఉత్తర తెలంగాణ డిస్కం (TSNPDCL) పరిధిలో 26 నెలల పాటు ఈ వసూళ్లు కొనసాగుతాయి. 2022-23, 2023-24 సంవత్సరాల్లో ఆయా వినియోగదారులు వాడిన మొత్తం యూనిట్ల ఆధారంగా ఈ ఛార్జీలను లెక్కించి బిల్లులో చేర్చనున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ఖర్చులతో ఇబ్బంది పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ తాజా ట్రూ-అప్ ఛార్జీలు మరింత భారాన్ని మిగల్చనున్నాయి.

Telangana electricity:బిల్లులలో కనిపించనున్న సరికొత్త మార్పులు

ట్రూ-అప్ ఛార్జీల వసూలు ప్రక్రియలో వినియోగదారులకు స్పష్టత ఉండాలని నియంత్రణ మండలి డిస్కంలను గట్టిగా ఆదేశించింది. నెలవారీ కరెంట్ బిల్లులలో ఇతర రెగ్యులర్ టారిఫ్ ఛార్జీలతో కలపకుండా, ట్రూ-ಅಪ್ మొత్తాన్ని ప్రత్యేక విభాగంలో స్పష్టంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది, ఎంత వినియోగానికి ఎంత యూనిట్ రేటు వేశారు అనే పూర్తి వివరాలను వినియోగదారులకు అందే బిల్లులో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఈ పారదర్శకత వల్ల వినియోగదారులకు ఏ నెలలో ఎంత అదనపు భారం పడుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. డిస్కంలు జారీ చేసే ప్రతి బిల్లులోనూ ఈ నిబంధన కచ్చితంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. ప్రజలు ఈ మార్పులను గమనించి తమ నెలవారీ బడ్జెట్‌ను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

Epaper: epaper.vaartha.com

ఆ రూట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలు తగ్గేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha