Droupadi Murmu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి గురువారం నాడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నగరంలోని ప్రసిద్ధ పున్నమిఘాట్‌ను సందర్శించనున్నారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసి, అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సరస్ మేళా ప్రారంభోత్సవం
పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ‘సరస్ మేళా (Saras Mela)’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్‌ను ఆమె తిలకించి, మహిళా సాధికారతకు సంబంధించిన ఉత్పత్తులను పరిశీలించనున్నారు.
Droupadi Murmu: స్వయం సహాయక సంఘాల మహిళలతో విందు
ఈ వేడుకల అనంతరం మధ్యాహ్నం వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో కలిసి ప్రత్యేకంగా భోజన విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల విజయాలు, వారి ఆర్థిక పురోగతిపై వారితో ముచ్చటించే అవకాశం ఉంది.
గన్నవరం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం
పున్నమిఘాట్ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Epaper: epaper.vaartha.com

