Indra kiladri: ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో దర్శన వేళలు, వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. దీంతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి వాహనాలపై ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. అలాగే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ దర్శనాల సమయాల్లోనూ మార్పులు చేశారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేయనున్నారు. రాత్రి 7.45 గంటలకు ఉండే ప్రోటోకాల్ దర్శన స్లాట్‌ను కూడా రద్దు చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకునే సమయంలో సాధారణ భక్తుల దర్శనాలకు కొంతసేపు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు ఆలయ అధికారులు సూచించే సమయాలను అనుసరించడం మంచిది.
సాయంత్రం ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము.. రాత్రి 7.10 గంటలకు ఇంద్రకీలాద్రి చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. సరిగ్గా రాత్రి 7:40 గంటలకు దర్శనం పూర్తి చేసుకుని కొండపై నుంచి తిరుగు పయనవుతారు.
Epaper: epaper.vaartha.com

