Next Bharat Ventures : భారతదేశంలో సామాజిక మార్పును, ఆర్థిక వృద్ధిని మేళవిస్తూ నెక్స్ట్ భారత్ వెంచర్స్ ఐఎఫ్‌ఎస్‌సి ప్రైవేట్ లిమిటెడ్ (NBV) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ వేదికగా దేశంలోనే అతిపెద్దది అయిన రూ. 2,000 కోట్ల భారీ ‘ఇంపాక్ట్ వెంచర్ ఫండ్-2’ను ఆ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటర్ కార్పొరేషన్’ ఈ రెండో ఫండ్‌కు యాంకర్ ఎల్‌పి (Anchor LP)గా వ్యవహరిస్తూ పెట్టుబడులకు నేతృత్వం వహిస్తోంది. గతంలో రూ. 340 కోట్లతో ప్రారంభించిన మొదటి ఫండ్ ద్వారా నెక్స్ట్ భారత్ ఇప్పటికే 50కి పైగా ఇంపాక్ట్ స్టార్టప్‌లకు అండగా నిలిచి, అందులో 20కి పైగా సంస్థల్లో నేరుగా పెట్టుబడులు పెట్టి విజయవంతమైంది. ఈ సరికొత్త రెండో ఫండ్ ద్వారా.. గ్రామీణ భారతదేశంతో పాటు, పట్టణ అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణ సరఫరా గొలుసు (Supply Chain), ఆర్థిక సమ్మిళితం, ఆరోగ్య సంరక్షణ, మరియు సామాజిక ప్రయోజనాల కోసం కృత్రిమ మేధ (AI) వంటి రంగాలలో వినూత్న ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు ఈ నిధి ద్వారా భారీగా పెట్టుబడులు, మార్గదర్శకత్వం లభించనున్నాయి.
‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రయాణం
ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ జాతీయ ప్రాధాన్యతలకు పూర్తి అనుగుణంగా సాగుతోంది. ఐఐటి హైదరాబాద్ పూర్వ విద్యార్థి, నెక్స్ట్ భారత్ వెంచర్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన విపుల్ జిందాల్ నాథ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రభావం, వ్యాపార లాభాలు రెండూ కలిసి సాధ్యమేనని తమ మొదటి ఫండ్ నిరూపించిందని, తమ పోర్ట్‌ఫోలియోలోని 90 శాతానికి పైగా కంపెనీలు ప్రారంభ సంవత్సరాల్లోనే లాభాల బాట పట్టాయని హర్షం వ్యక్తం చేశారు. అలాగే, సుజుకి మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి మాట్లాడుతూ, భారతదేశంలో గత నాలుగు దశాబ్దాలుగా తాము కార్ల కంటే మిన్నగా 3,000 మందికి పైగా స్థానిక పారిశ్రామికవేత్తలను సృష్టించగలిగామని, ఈ రెండో ఫండ్‌తో ఆ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. నెక్స్ట్ భారత్ వెంచర్స్ కేవలం మూలధనానికే పరిమితం కాకుండా 10 రోజుల రెసిడెన్సీ ప్రోగ్రామ్, ‘వై క్లబ్’ కమ్యూనిటీ ద్వారా రూ. 1 నుంచి 5 కోట్ల వరకు ఈక్విటీ పెట్టుబడులను అందిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పెట్టుబడులు పొందిన మీమెరాకి, ఈ-బైక్ (E-Bik), ఎస్‌జిబి ఆగ్రో (SGB Agro), మరియు దివ్యాంగుల ఉపాధి వేదిక ‘ఎటిపికల్ అడ్వాంటేజ్’ వంటి ఎన్నో గ్రామీణ బ్రాండ్లు క్షేత్రస్థాయిలో అద్భుతమైన సామాజిక, ఆర్థిక పరివర్తనను తీసుకువస్తున్నాయి.

