Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల రోజుల్లోనే సీసీ రోడ్డు నిర్మాణం

నెల రోజుల్లోనే సీసీ రోడ్డు నిర్మాణం

వార్త 1 week ago

Minister Ponguru Narayana Nellore: నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్ జొన్నలగడ్డవారి వీధిలో రూ. 28.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘనంగా ప్రారంభించారు.

దీంతో పాటు నెల్లూరు నగరపాలక సంస్థ రూ. 1.20 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న రెండు అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UDG) జెట్టింగ్ మిషన్ వాహనాలను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో కేవలం నెల రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం పట్ల స్థానిక వ్యాపారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

నిలిచిపోయిన ప్రాజెక్టులకు పునరుజ్జీవం - రూ. 250 కోట్లతో నూతన పనులు

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు నగర సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. 2014-15 కాలంలో రూ. 550 కోట్లతో యూడీజీ ప్రాజెక్ట్, మరో రూ. 550 కోట్లతో సంగం బ్యారేజీ తాగునీటి సరఫరా పనులను చేపట్టామని, అయితే గత ప్రభుత్వం 90 శాతం పూర్తయిన ఈ పనులను నిర్లక్ష్యంతో నిలిపివేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించిందని, త్వరలోనే వీటిని ప్రజలకు అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే 13వ డివిజన్ పరిధిలో మరో రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో నూతన యూడీజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Minister Ponguru Narayana Nellore: రూపాయికే డ్రైనేజీ కనెక్షన్ - 10 వాయిదాల్లో చెల్లింపు వెసులుబాటు

నెల్లూరు నగరాన్ని సంపూర్ణంగా దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు 100 శాతం యూడీజీ వ్యవస్థ ద్వారానే దోమల సమస్యను అధిగమించాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో గతంలో రూ. 10,000 ఉన్న యూడీజీ కనెక్షన్ రుసుమును కేవలం రూపాయికే తగ్గించామన్నారు. నెలకు రూ. 1,000 లోపు ఆస్తి పన్ను చెల్లించే పేదలకు ఉచితంగా కనెక్షన్ అందిస్తామని, రూ. 2,000 లోపు పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన వారు కనెక్షన్ రుసుమును ఐదేళ్ల కాలంలో 10 వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించామని, కార్పొరేషన్ పరిధిలోని రెండు లక్షల కుటుంబాలు కనెక్షన్లు తీసుకుని సహకరించాలని కోరారు. న్యాయస్థానాల తీర్పు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, ప్రముఖ నాయకులు పుట్టా అజయ్, కోకు మహేంద్రరెడ్డి, సత్యనాగేశ్వరరావు, డాక్టర్ పోకల రవి తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha