Uniforms : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.
ఇప్పటికే విద్యార్థులకు ఒక జత యూనిఫాంను పంపిణీ చేసిన విద్యాశాఖ, ఇప్పుడు రెండో జతను కూడా ఈ నెలాఖరులోగా (Uniforms) పూర్తిస్థాయిలో అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆకర్షణీయమైన రంగులు, మెరుగైన నాణ్యతతో :
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల నాణ్యత మరియు డిజైన్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆకర్షణీయమైన రంగులు, మెరుగైన నాణ్యతతో కూడిన యూనిఫాంలను విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నాటి నుంచే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మొదటి విడత కింద ఒక జత యూనిఫాంలను పంపిణీ చేశారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. ఈ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండో జత యూనిఫాంల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ నెలాఖరు నాటికి విద్యార్థులందరికీ రెండో జత యూనిఫాం అందేలా చర్యలు చేపట్టింది. ఈ యూనిఫాంల తయారీ ప్రక్రియలో ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అవసరమైన దుస్తులను కుట్టే బాధ్యతను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) అప్పగించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి లవించడంతో పాటు వారికి ఆర్థికంగా మంచి భరోసా కలుగుతోంది.
నాణ్యమైన దుస్తులను సకాలంలో కుట్టి అందించడంలో మహిళా సంఘాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు రెండు జతల నాణ్యమైన యూనిఫాంలు అందుతుండటంతో ప్రభుత్వ బడుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ముమ్మర ఏర్పాట్లతో ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థికి రెండో జత యూనిఫాం చేతికి అందనుంది.
మరో పదేళ్లలో పెరగనున్న డాక్టర్ల కొరత : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక

