Satellite Images Nepal Floods : నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోర జలప్రళయానికి భూకంపం కారణం కాదని, 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ హిమానీనదం (Glacier) విరిగిపడటమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సేకరించిన ఉపగ్రహ చిత్రాలు, ల్యాండ్‌శాట్-9 డేటా ఆధారంగా ఈ విపత్తు తీవ్రత వెలుగులోకి వచ్చింది. పర్వత శిఖరంపై ఉన్న హిమానీనదంలో దాదాపు రెండు మూడొంతుల భాగం విరిగిపడి, సుమారు 1.2 కిలోమీటర్ల దిగువన ఉన్న ‘లెండే ఖోలా’ నదీ పరివాహక ప్రాంతంలో పడిపోయింది.
Read Also: Trump : మొజ్తాబా ఖమేనీ చనిపోలేదు కానీ తీవ్రంగా గాయపడ్డారు : ట్రంప్
Satellite Images Nepal Floods
‘లిక్విడ్ కాంక్రీట్’ రూపంలో ప్రవాహం
పైనుంచి భారీ ఎత్తున విరిగిపడిన మంచు ముక్కలు, రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు అత్యంత వేగంతో దిగువకు దూసుకొచ్చాయి. ఈ ప్రవాహం అత్యధిక సాంద్రత కలిగి ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిని ‘లిక్విడ్ కాంక్రీట్’ ప్రవాహంగా వర్ణించారు. ఈ శిథిలాలు మొదట నది ప్రవాహానికి అడ్డుకట్ట వేయగా, ఆ తాత్కాలిక ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో దిగువనున్న భోటే కోశీ-త్రిశూలి కారిడార్ తీవ్రంగా దెబ్బతింది. భారీ బండరాళ్లు, వాహనాలు, ఇళ్లు ఈ ఉగ్ర ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
Satellite Images Nepal Floods :భూకంపం కాదని స్పష్టం చేసిన శాస్త్రవేత్తలు
ప్రారంభంలో ఈ ప్రమాదానికి భూకంపమే కారణమని భావించినప్పటికీ, భూకంప తరంగాల లోతైన విశ్లేషణ ద్వారా ఆ అంచనా తప్పని తేలింది. హిమానీనదం అత్యంత బలమైన వేగంతో కూలిపోవడం వల్ల ఏర్పడిన ప్రకంపనలే సీస్మోగ్రాఫ్‌లలో నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పర్వతంపై హిమానీనదం విరిగిపడటం నుంచి నది అడ్డుకట్ట తెగిపోవడం వరకు అన్ని పరిణామాలు ఒక చైన్ రియాక్షన్‌లా వరుసగా జరిగాయి. పుడమి ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతుండటం (గ్లోబల్ వార్మింగ్) వల్ల హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న మంచు పొరలు క్రమంగా బలహీనపడుతున్నాయి. పర్వత ప్రాంతాలు అస్థిరంగా మారి ఇలాంటి భారీ మంచు చరియలు విరిగిపడే ప్రమాదాలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

