Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆమోదం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆమోదం

వార్త 3 weeks ago

Telangana Police Notification: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఖాకీ చొక్కా తొడగడమే లక్ష్యంగా సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ, హోంశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది.

పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శకటాల విభాగం, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్‌) వంటి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురించాయి.

ఇప్పటికే 5,000 పోస్టులకు జీవోలు జారీ

ఈ నియామక ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 5,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను (GOs) విడుదల చేసింది. మిగిలిన 2,000 పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలు కూడా మరో రెండు రోజుల్లో వెలువడనున్నాయని సమాచారం. ఆర్థిక శాఖ నుంచి కూడా వీటికి అనుమతులు లభించడంతో, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే అభ్యర్థుల అర్హతలు, సిలబస్, పరీక్షల షెడ్యూల్‌తో కూడిన పూర్తి నోటిఫికేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

Telangana Police Notification: అభ్యర్థుల విజ్ఞప్తులకు లభించిన సానుకూల స్పందన

రాష్ట్రంలో కొత్త పోలీస్ రిక్రూట్‌మెంట్లు చేపట్టాలని, అలాగే వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు, అభ్యర్థులు గత కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల విన్నపాలను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు, వివాదాలు తలెత్తకుండా అత్యంత పారదర్శకంగా ఈ రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేసేందుకు పోలీస్ నియామక మండలి అధికారులు పక్కా విధివిధానాలను రూపొందిస్తున్నారు.

స్వరాష్ట్రంలో నాలుగో విడత పోలీస్ భర్తీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖలో ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో జరిగిన నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మొదటి విడత (2015): తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 9,281 పోస్టులతో మొదటి నోటిఫికేషన్ విడుదలైంది.
  • రెండో విడత (2018): రికార్డు స్థాయిలో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులతో భారీ భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
  • మూడో విడత (2022): 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ పూర్తి చేశారు.

ప్రస్తుతం నాలుగో విడత కింద మరో 7,000 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ కావడంతో, పోలీస్ శాఖలో స్థిరపడాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

4వ విడత రైతు భరోసాగా రూ.1188 కోట్లు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha