Vizianagaram Food Safety Raids: విజయనగరం జిల్లాలోని పలు వాణిజ్య సముదాయాలపై ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఐపీఎం (IPM) సంచాలకుల ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్.
ఈశ్వరి పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పి. శ్రీను, పి. వెంకటరమణ బృందం విజయనగరం, గజపతినగరం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో స్థానిక షాపింగ్ మాల్స్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు హోల్‌సేల్ వ్యాపార కేంద్రాల్లో ఈ సోదాలు కొనసాగాయి.
ఎల్జీ, ఎవరెస్ట్ ఇంగువ అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు
ఈ తనిఖీల సందర్భంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్లో చలామణీ అవుతున్న ప్రముఖ బ్రాండ్లు ఎల్జీ (LG), ఎవరెస్ట్ (Everest) ఇంగువ పొడి నిల్వలను అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాండ్లకు చెందిన ఇంగువ విక్రయాలు, సరఫరా, పంపిణీలను తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు తక్షణమే నిలిపివేయాలని హోల్‌సేల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Vizianagaram Food Safety Raids: హైదరాబాద్ ల్యాబ్‌కు నమూనాలు - రిపోర్టుల ఆధారంగా చర్యలు
వివిధ దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్న సంబంధిత ఇంగువ పొడి నమూనాలను నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ల్యాబ్ నుంచి వచ్చే అధికారిక పరీక్షా నివేదికల ఆధారంగా వ్యాపారులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు

