NEET : నీట్ (NEET) పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించే ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, ఈ నిరసనలకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా ఈ వ్యవహారంపై విద్యార్థులపై కొత్త కేసులు నమోదు చేయకూడదని ఆదేశించింది.
తీవ్ర నేరచరిత్ర ఉన్నవారిపై చర్యలకు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలకు సంబంధించి నమోదైన FIRలను కొట్టేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, నిరసనల నెపంతో హింసాత్మక చర్యలకు పాల్పడిన మరియు తీవ్రమైన నేరచరిత్ర ఉన్న 2,873 మందిపై మాత్రం కొత్త కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు అత్యున్నత కోర్టు అనుమతినిచ్చింది. సాధారణ విద్యార్థులకు ఊరటనిస్తూనే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సమాజ విద్రోహ శక్తులపై చర్యలకు అవకాశం ఇవ్వడం గమనార్హం.

