Essential Commodities : దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భాగా పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
“మోదీ జీ మీరు చెప్పినట్లే డబుల్ చేశారు.. కానీ ప్రజల ఆదాయాన్ని కాదు, నిత్యవసరాల ధరలను రెట్టింపు చేశారు” అంటూ సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా సెటైర్లు వేసింది. మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్న ధరలతో పోల్చుతూ ప్రస్తుత ధరల వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం గతంలో కేజీ చక్కెర రూ. 30, బెల్లం రూ. 40, లీటర్ పాలు రూ. 30, ఉల్లి రూ. 12 మరియు గుడ్డు ఒక్కటి రూ. 4గా ఉండేవని గుర్తుచేసింది. అయితే 2026 నాటికి ఆయా వస్తువుల ధరలు వరుసగా చక్కెర రూ. 70, బెల్లం రూ. 100, పాలు రూ. 60, ఉల్లి రూ. 70 మరియు గుడ్డు ధర రూ. 10కి పెరిగాయని పేర్కొంది.

మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టర్.. చుక్కలు చూస్తున్న సామాన్యుడు
ఈ పెంపు కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదాయ మార్గాలు పెరగకపోయినా, రోజువారీ నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడింది. ప్రతి ఏటా పెరిగిపోతున్న ఇంధనం, వంటగ్యాస్ మరియు ప్రాథమిక ఆహార పదార్థాల ధరల భారాన్ని ప్రభుత్వం వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తుండటంతో కాంగ్రెస్ షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

