Akbaruddin Owaisi: సల్కం చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలపై ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా (HYDRAA) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఎంఐఎం (MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గౌస్‌నగర్‌లోని విద్యా క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భయపడే ప్రసక్తే లేదు.. ఎలా కాపాడుకోవాలో తెలుసు!
ఫాతిమా కళాశాల అంశాన్ని తెరపైకి తెచ్చి తమను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎలాంటి అక్రమాలకు లేదా అవినీతికి పాల్పడలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ సంస్థలను ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు. “మాదొక్క విద్యాసంస్థను కూల్చేస్తే.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో వంద విద్యాసంస్థలను నిర్మించి చూపిస్తాం” అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సంస్థలు ఉన్నా, లేకపోయినా పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Akbaruddin Owaisi: రూ.1.19 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఉచిత పుస్తకాల పంపిణీ
ఈ కార్యక్రమం వేదికగా సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో అక్బరుద్దీన్ ఒవైసీ విద్యార్థులకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దాదాపు 366 మంది నిరుపేద విద్యార్థుల పేరు మీద రూ. 1 కోటీ 19 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

