Mandadi Movie: వరుస విజయాలు అందుకుంటున్న నటుడు సూరి. తెలుగులోనూ విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్. వీరిద్దరూ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మండాడి'.
మది మారన్ పుగళేంది దర్శకత్వంలో సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఈ రోజే (అక్టోబర్ 8) ప్రముఖ ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Read Also : Chiranjeevi : తమిళ డైరెక్టర్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ?
'Mandadi' has arrived on OTT-how is the movie?
Mandadi Movie: కథ
కళింగపట్నం అనే సముద్ర తీరప్రాంత గూడెంలో జాలరులు నివసిస్తుంటారు. అక్కడ ఏటా జరిగే జాతర సందర్భంగా నిర్వహించే పడవ పందాల్లో 'మండాడి' జట్టు ఎప్పుడూ విజయం సాధిస్తుంటుంది. ఈ జట్టుకి కాళీ (సూరి), పులి (సుహాస్) ప్రాతినిధ్యం వహిస్తూ మంచి స్నేహితులుగా ఉంటారు. వీరిద్దరూ మునెయ్య (సత్యరాజ్) దగ్గర పడవ పోటీల మెళకువలు నేర్చుకుంటారు.
మునెయ్య కూతురు చిలకమ్మ (మహిమా నంబియార్), కాళీ ప్రేమించుకుంటారు. అయితే, కొన్ని అనూహ్యమైన సంఘటనల వల్ల కాళీ ఊరు వదిలి నగరానికి వెళ్లిపోతాడు. అలా 20 ఏళ్లు గడిచాక, మళ్లీ కళింగపట్నంలో జరిగిన పడవ పందాల గొడవలో పులి కొడుకు కిశోర్ గాయపడతాడు. కిశోర్ పై దాడి చేసిన మల్లేశ్ అనే కుర్రాడు పులి భయంతో సిటీలోని కాళీ దగ్గరకు పారిపోతాడు. తన కొడుకుని కొట్టిన మల్లేశ్‌కి కాళీ ఆశ్రయం ఇచ్చాడని తెలిసి, ఇద్దరినీ లేపేయమని పులి తన అనుచరులను పంపుతాడు. మరి పులి మనుషుల నుండి కాళీ తప్పించుకున్నాడా? అసలు 20 ఏళ్ల క్రితం కాళీ ఊరిని, ప్రేమించిన చిలకమ్మను వదిలి ఎందుకు వెళ్లాడు? మల్లేశ్‌కీ కాళీకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఒక సముద్ర తీరప్రాంత జాలరి గూడెం, పడవ పందాలు, ప్రాణస్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. స్థానిక కుట్రలు, కుతంత్రాలు కథకు మరింత బలాన్నిచ్చాయి.
- ఫస్టాఫ్: కాళీ, పులి మధ్య ఉన్న కోపం, ద్వేషంతో కథ మొదలవుతుంది. మల్లేశ్ వల్ల ఇద్దరి మధ్య మళ్లీ మొదలైన శత్రుత్వం, పాత పడవ పందాలు మళ్లీ తెరపైకి రావడం చూపిస్తూ.. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారనే కుతూహలాన్ని ఫస్టాఫ్ బాగా పెంచుతుంది.
- సెకండాఫ్: 20 ఏళ్ల క్రితం జరిగింది ఏంటి? కాళీ ఎందుకు ఊరు వదిలి వెళ్లాడు? అనే విషయాలను ఎమోషనల్‌గా రివీల్ చేస్తూ సెకండాఫ్ నడుస్తుంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, పడవ పందాల ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
పాత్రల పనితీరు & సాంకేతిక విభాగం
కాళీ, పులి పాత్రలే ఈ కథకు రెండు కళ్లు. స్నేహం కోసం అన్నిటినీ వదులుకునే పాత్రలో సూరి ఒదిగిపోగా, స్నేహాన్నే వదిలేసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుహాస్ అద్భుతంగా నటించారు. మహిమా నంబియార్, సత్యరాజ్ తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
సాంకేతికంగా కథిర్ ఫొటోగ్రఫీ సముద్ర తీరప్రాంత వాతావరణాన్ని చాలా సహజంగా చూపించింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఎమోషన్‌ను, యాక్షన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ పదునుగా ఉంది.
ముగింపు
సున్నితమైన ప్రేమ, గురుశిష్యుల అనుబంధం, స్నేహం, పగ, బలమైన యాక్షన్ ఎమోషన్ కలగలిసిన సహజమైన కథ 'మండాడి'. ఓటీటీలో ఒక మంచి ఇంటెన్స్ డ్రామాను చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నిరాశపరచదు.
రేటింగ్: 3/5
దసరా బరిలో ఐదు సినిమాలు.. బాక్సాఫీస్ వార్ మాత్రం ఆ రెండింటి మధ్యే

