Toxic : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరుస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వసూళ్లు రెండో రోజు నుంచే పాతాళానికి పడిపోయాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించినప్పటికీ, రెండో రోజు నాటికి ఆ జోరు పూర్తిగా తగ్గింది. ప్రముఖ ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ Sacnilk నివేదికల ప్రకారం, రెండవ రోజు ఈ చిత్రం కేవలం రూ. 36 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. కలెక్షన్లలో ఇంత భారీ డ్రాప్ కనిపించడంతో సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన థియేటర్లు: పుంజుకుంటున్న ‘ఇరుముడి’
‘టాక్సిక్’ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా, బాక్సాఫీస్ వద్ద సన్సేషన్ సృష్టిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో థియేటర్ యాజమాన్యాలు మళ్లీ ఆ సినిమాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా తెలుగు నేలపై టాక్సిక్‌కు దక్కాల్సిన స్క్రీన్లను తగ్గించి ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్ల సంఖ్యను పెంచేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. మొదటి రోజు సాధించిన ఓపెనింగ్స్ నిలుపుకోవడంలో విఫలమైన టాక్సిక్, లాంగ్ రన్‌లో ఏ మేరకు నిలబడుతుందో వేచి చూడాల్సి ఉంది.

