Ayithampudi Canal Car Accident: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఆదివారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయితంపూడి లాకుల సమీపంలో నియంత్రణ కోల్పోయిన ఓ కారు ప్రమాదవశాత్తు వేగంగా పెరవలి - నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహంలో గల్లంతు కాగా, మరొకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శనివారం రాత్రి పెరవలిలో జరిగిన తమ మిత్రుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలోని పెళ్లికొడుకు నివాసానికి చేరుకుని, అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరిగి బయలుదేరారు. ఓగిడి నుంచి ఆయితంపూడి వెళ్లే మార్గంలో తీవ్రమైన మలుపు వద్ద కారు అదుపుతప్పి నేరుగా కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఒక యువకుడు వెంటనే బయటకు వచ్చి ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకోగా (స్థానికులు రక్షించగా), మిగిలిన నలుగురు విద్యార్థులు కారుతో సహా నీటిలో మునిగి గల్లంతయ్యారు.
Ayithampudi Canal Car Accident: గాలింపు చర్యలు ముమ్మరం - ఇద్దరి మృతదేహాలు వెలికితీత
గల్లంతైన వారిని మలికిపురం మండలం మోరి గ్రామానికి చెందిన నాగబత్తుల తేజ సాయి సూర్య (19), చెరుకూరి రాజా రామ్ చరణ్ (17), పోతుల లక్ష్మీ భాను వికాస్ అభిరామ్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే తాడేపల్లిగూడెం డీఎస్పీ యు. రవిచంద్ర, తణుకు రూరల్, టౌన్ సీఐలు డి. వెంకటేశ్వరరావు, జేవీ రమణ ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్న సమయానికి దుస్వంత్ సాయి, లక్ష్మీ భానుల మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
స్థానిక ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చేతికందివచ్చిన యువ విద్యార్థులు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

