Kothakota Dowry Death: చేతులకు పెట్టిన మెహందీ రంగు కూడా పూర్తిగా చెరిగిపోకముందే అదనపు కట్నం పిశాచికి మరొక నవవధువు బలైపోయింది. అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ హద్దులు దాటడంతో ఆ మానసిక క్షోభను తట్టుకోలేక పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉషారాణి (20) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Kothakota Dowry Death: దారుణ ఘటన వివరాలు & కేసు నమోదు

కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన పద్మమ్మ, వెంకటయ్యల కుమార్తె ఉషారాణికి దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన దుస్తుల వ్యాపారి మల్లేష్‌తో జూన్ 25న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబ సభ్యులు 6 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదును కట్నంగా ఇచ్చారు. ఆనందంగా సాగాల్సిన కాపురంలో పెళ్లయిన నెల రోజులకే కట్నం చిచ్చు రగిలింది. భర్త మల్లేష్, అత్తామామలు అంజిలమ్మ, హనుమంతు కలిసి ఉషారాణిని అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. వ్యాపార అవసరాల నిమిత్తం పుట్టింటి నుంచి అదనంగా రూ. 20 లక్షలు తీసుకురావాలని గత నాలుగు రోజులుగా ఆమెపై అత్తింటి వారు తీవ్ర మానసిక ఒత్తిడి తెచ్చారు. అత్తింటి వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఉషారాణి మంగళవారం మధ్యాహ్నం కనిమెట్టలోని పుట్టింటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని అదను చూసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకే కన్నకూతురు విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
Epaper: epaper.vaartha.com
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కుమారుడి అరెస్ట్

