Shanmukh Jaswanth: తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.
తన చిరకాల ప్రేయసి వైష్ణవిని ఆయన పెళ్లాడాడు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మరియు కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన మనోహరమైన చిత్రాలను షణ్ముఖ్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్న ఈ నూతన దంపతుల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Read also: Vijay Mallya : విజయ్ మాల్యాగా అర్జున్.. నిజమేనా?
అండగా నిలిచిన ప్రేమ.. పెళ్లి పీటల వరకు
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్, విభిన్నమైన నటనతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో వైష్ణవి అతనికి కొండంత అండగా నిలిచింది. వీరి పరిచయం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారడం, ఇప్పుడు ఇరువైపులా పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటవడం విశేషం. ఈ కొత్త జంటను చూసి అభిమానులు మురిసిపోతూ “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు, తోటి క్రియేటర్లు సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Shanmukh Jaswanth: యూట్యూబ్ ‘కింగ్’ ప్రస్థానం
తెలుగు యూట్యూబ్ రంగంలో అత్యంత వేగంగా 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ సాధించిన టాప్ ఇండిపెండెంట్ క్రియేటర్లలో షణ్ముఖ్ ఒకరు. ప్రస్తుతం అతని ఛానల్‌కు దాదాపు 4.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతని కెరీర్‌ను మలుపు తిప్పిన ఘనత 'ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌పర్' (The Software DevLOVEper) వెబ్ సిరీస్‌కే దక్కుతుంది. ఇందులో "షన్నూ"గా అతని యాక్టింగ్ ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'సూర్య', 'స్టూడెంట్' సిరీస్‌లు కూడా మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి.
బుల్లితెరపై క్రేజ్.. కొత్త అధ్యాయం
యూట్యూబ్ సిరీస్‌ల సక్సెస్ అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో రన్నరప్‌గా నిలిచి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు షణ్ముఖ్. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీలో 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే డిటెక్టివ్ సిరీస్‌తోనూ అలరించాడు. గతంలో మరో క్రియేటర్ దీప్తి సునైనాతో నడిపిన సుదీర్ఘ ప్రేమాయణం, ఆ తర్వాతి బ్రేకప్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ పాత చేదు జ్ఞాపకాలను, ఒడిదుడుకులను దాటుకుని షణ్ముఖ్ ఇప్పుడు తన జీవితంలో ఒక సరికొత్త హ్యాపీ చాప్టర్‌ను ప్రారంభించాడు.


Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
read also:

