Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీపీపీ మోడల్‌తో అభివృద్ధికి చంద్రబాబు కొత్త వ్యూహం.. 'వీజీఎఫ్ విప్లవం'పై ఫోకస్

పీపీపీ మోడల్‌తో అభివృద్ధికి చంద్రబాబు కొత్త వ్యూహం.. 'వీజీఎఫ్ విప్లవం'పై ఫోకస్

వార్త 3 weeks ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) ఆధారిత ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీపీపీ ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయంపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలోనే ‘ఆంధ్రప్రదేశ్ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ ను మంత్రివర్గం (కేబినెట్) ఆమోదం కోసం తీసుకురావాలని, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

రూ. 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు:

రాష్ట్రంలో ప్రస్తుతం పోర్టులు, విమానాశ్రయాలు, టూరిజం వంటి వివిధ రంగాల్లో రూ. 1,23,229 కోట్ల విలువైన 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పురోగతిలో ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న వైద్య కళాశాలల విధానాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజీల ప్రాజెక్టులకు కేంద్రం నుండి రూ. 1,468 కోట్ల వీజీఎఫ్ నిధులు రానున్నాయని చెప్పారు. వీటితో పాటు విజయవాడ, తిరుపతి నగరాల్లోని ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 178 కోట్ల వీజీఎఫ్ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.

Chandrababu Naidu: కోస్టల్ టూరిజంలో మత్స్యకారులకు భాగస్వామ్యం:

రాష్ట్రంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను పెంచేలా, దీర్ఘకాలికంగా నిలదొక్కుకునే (Sustainable) మోడల్‌లో ఉండాలని సీఎం సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల ద్వారా స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పించి, వారిని భాగస్వాములను చేయాలన్నారు. అలాగే ఏపీలోని 21 ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల కోసం మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నిరుపయోగ ఆస్తుల వాణిజ్యీకరణ.. ఆదాయ వనరుల పెంపు:

ప్రభుత్వ పరిధిలో వృథాగా ఉన్న భూములు, ఆస్తులను కొత్త అవకాశాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఖాళీగా ఉన్న భూములను వాణిజ్యపరంగా (Commercial) వినియోగించుకోవాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థులను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా మార్చేందుకు, రెసిడెన్షియల్ హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

తల్లికి వందనం డబ్బులు జులై 22న ఖాతాల్లోకి రూ.13,000!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha