Dailyhunt

PMO: కొత్త భవనం 'సేవా తీర్థ్‌'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వార్త 1 month ago
PMO: కొత్త భవనం 'సేవా తీర్థ్‌'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత పరిపాలనా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కొత్త భవనం 'సేవా తీర్థ్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత మౌలిక సదుపాయాలకు స్వస్తి పలుకుతూ, అత్యున్నత నిర్ణయాధికార సంస్థలన్నింటినీ ఒకే చోటకు చేర్చే లక్ష్యంతో నిర్మించిన ఆధునిక సముదాయాలను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభమైన Kartavya Bhavan-1, Kartavya Bhavan-2, Seva Teerth Complex లను ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా పీఎంఓ కార్యాలయం కొత్త భవనంలోకి మారడం విశేషం.

Kerala: ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

పనితీరుకు, పారదర్శక పాలనకు నిదర్శనం

ఈ సందర్భంగా రూ.100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఇకపై అత్యాధునిక వసతులతో కూడిన ఈ భవనం నుంచే ప్రధాని కార్యకలాపాలు కొనసాగనున్నాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పాత భవనాల స్థానంలో అత్యాధునిక వసతులతో ఈ కొత్త భవనాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని.. ఈ కొత్త కాంప్లెక్స్ కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదని.. ఇది నవ భారత పనితీరుకు, పారదర్శక పాలనకు నిదర్శనమని తెలిపారు.

ఇప్పటివరకు సెంట్రల్ విస్టాలోని వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న కార్యాలయాలను ఇప్పుడు ఒకే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లోకి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా..

  • ప్రధానమంత్రి కార్యాలయం
  • జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్
  • క్యాబినెట్ సెక్రటేరియట్

దీనివల్ల శాఖల మధ్య సమన్వయం పెరగడమే కాకుండా పరిపాలనాపరమైన జాప్యం తగ్గి నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం కలుగుతుంది.

ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు

నూతనంగా ప్రారంభించిన సేవా తీర్థం కార్యాలయంలో అడుగుపెట్టిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనహితమే లక్ష్యంగా కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. రైతులు, మహిళలు, యువత, సామాన్య పౌరుల జీవితాల్లో వెలుగులు నింపేలా నాలుగు ప్రధాన పథకాలకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం సేవా స్ఫూర్తి అని, ఇవి సమాజంలోని ప్రతి వర్గాన్ని స్పృశిస్తాయని ప్రభుత్వం తెలిపారు..

PM RAHAT పథకం

ప్రమాదాల బారిన పడిన పౌరులను ఆదుకునేందుకు PM RAHAT పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.

లఖ్పతి దీదీలు

మహిళా సాధికారతలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యాన్ని ఏడాది ముందే చేరుకోవడంతో, ప్రధాని ఈ లక్ష్యాన్ని ఇప్పుడు రెట్టింపు చేశారు. మార్చి 2029 నాటికి 6 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు.

అన్నదాతకు అండ

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రధాని భారీ కేటాయింపులు చేశారు. గతంలో రూ.1 లక్ష కోట్లుగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు రెట్టింపు చేస్తూ సంతకం చేశారు. దీనివల్ల గ్రామాల్లో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం కానుంది.

స్టార్టప్ ఇండియా 2.0

భారత యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 కు ఆమోదం లభించింది. రూ.10,000 కోట్ల భారీ కార్పస్‌తో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు ఇది గొప్ప వరంగా మారనుంది.

గ్రీన్ బిల్డింగ్ - 4 స్టార్ ప్రమాణాలు

పర్యావరణ హితానికి పెద్దపీట వేస్తూ ఈ సముదాయాలను 4-స్టార్ GRIHA గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించారు. ఇది దాదాపు 2.26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని సుమారు రూ.1,189 కోట్ల వ్యయంతో నిర్మించారు. భవన అవసరాల కోసం సోలార్ ప్యానెల్స్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం. అత్యాధునిక నీటి రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు. డిజిటల్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్స్, అత్యున్నత స్థాయి నిఘా వ్యవస్థలు వంటివి ఉంటాయి.

11 కీలక మంత్రిత్వ శాఖలకు కొలువు

కర్తవ్య భవన్-1, 2 భవనాల్లో రక్షణ, ఆర్థిక, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, న్యాయ శాఖలతో సహా మొత్తం 11 కీలక మంత్రిత్వ శాఖలు కొలువుదీరనున్నాయి. పౌరుల సౌకర్యార్థం ఇందులో కేంద్రీకృత రిసెప్షన్, పబ్లిక్ ఇంటర్‌ఫేస్ జోన్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తప్పుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha