Danush Political Entry : తమిళ చిత్రసీమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, కమల్ హాసన్ నుంచి ఇటీవల 'తమిళగ వెట్రి కజగం' పార్టీ పెట్టిన విజయ్ వరకు ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ఇప్పుడు అదే బాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ కూడా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల తన అభిమాన సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అభిమానుల శక్తిని కేవలం సినిమా వేడుకలు, ఆడియో లాంచ్‌లకే పరిమితం చేయకుండా.. ప్రజా సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని ఆయన పిలుపునివ్వడం భవిష్యత్ రాజకీయ ప్రణాళికలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సామాజిక సేవ వెనుక పొలిటికల్ స్కెచ్: గ్రౌండ్ లెవెల్‌లో బలపడే యత్నం?
తమ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందిస్తూ ఆర్గనైజేషన్‌ను బలోపేతం చేయాలని ధనుష్ తన అభిమానులకు మార్గదర్శనం చేశారు. పైకి ఇది కేవలం సేవా దృక్పథంతో చేసిన పిలుపులా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక పక్కా రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విజయ్ కూడా ముందుగా తన ఫ్యాన్ క్లబ్స్‌ను సామాజిక సేవా రంగంలో క్రియాశీలకం చేసి, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే పూర్తిస్థాయి రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే తరహా వ్యూహంతో గ్రౌండ్ లెవెల్‌లో తన అభిమాన సంఘాలను ప్రజా సమస్యలపై పోరాడేలా సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ధనుష్ సైలెంట్‌గా వేస్తున్న ఈ పొలిటికల్ అడుగులు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

