TG Smart Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సేవలను సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు అర్హులైన లబ్ధిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు.
Read Also : Bhadrachalam : భద్రాచలంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రం
Where is PM Modi’s photo? BJP criticizes smart ration cards.
అయితే, ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందే రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు నమూనాలో (మోడల్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను మాత్రమే ముద్రించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత రేషన్ బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నప్పుడు ప్రధాని ఫోటోను ఎందుకు పొందుపరచలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
TG Smart Ration Card: కేంద్రం పాత్రను గుర్తించాలి: బీజేపీ
స్మార్ట్ రేషన్ కార్డుల నమూనాపై బీజేపీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వంత ప్రచారం కోసం సీఎం, పౌరసరఫరాల మంత్రి ఫోటోలను మాత్రమే వేసుకోవడం సరికాదని విమర్శించారు. ఉచిత బియ్యం అందించడంలో కేంద్రం వహిస్తున్న ముఖ్యమైన పాత్రను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తూ.. భవిష్యత్తులో పాలకులు లేదా ప్రభుత్వం మారినప్పుడల్లా మళ్లీ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.
‘ప్రధాని ఫోటో లేకుండా పంపిణీ నిలిపివేయాలి’ – ఎంపీ రఘునందన్ రావు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు అందే ప్రతి ఆరు కిలోల రేషన్ బియ్యంలో ఐదు కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కార్డుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించడం కేంద్రాన్ని అవమానించడమేనని ఆరోపించారు. ప్రధాని ఫోటో లేకుండా కార్డుల పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో నిరసనల నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే దానికి బీజేపీని బాధ్యులను చేయవద్దని ముందస్తుగా హెచ్చరించారు. దీంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

