World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రాంగణంలో సరికొత్తగా కనిపించారు.
అసెంబ్లీ ఆవరణలో తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మీడియా ఫొటోగ్రాఫర్లతో ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల కెమెరాను స్వయంగా తన చేతిలోకి తీసుకుని, అక్కడే ఉన్న వారి చిత్రాలను తానే స్వయంగా క్లిక్ మనిపించారు.

'ఎక్స్' వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు
తాను స్వయంగా తీసిన ఆ ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. చరిత్రను సజీవంగా నిలిపేసే అద్భుతమైన కళ ఫొటోగ్రఫీ అని ఆయన అభివర్ణించారు. కాల గర్భంలో కలిసిపోయే జ్ఞాపకాలను పదికాలాల పాటు భద్రపరిచే ఫొటోగ్రాఫర్ల సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు.
World Photography Day: ఫొటోగ్రాఫర్ల అంకితభావానికి ప్రశంసలు
మీడియా మరియు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. వారి అవిశ్రాంత కృషి, కళానైపుణ్యం మనందరికీ సమాజాన్ని కొత్త కోణంలో చూసే దృక్పథాన్ని అందిస్తాయని తెలిపారు. రాబోయే తరాల కోసం కాలంలోని ప్రతి సుందర క్షణాన్ని బంధిస్తున్న ఫొటోగ్రఫీ కమ్యూనిటీ మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

