Lawrence Wong : ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకునే ప్రభుత్వ అధినేతగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నారు.
సింగపూర్ ప్రభుత్వం తాజాగా రాజకీయ నాయకుల వేతనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వాంగ్ వార్షిక బెంచ్‌మార్క్ పారితోషికం 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.6 మిలియన్ డాలర్లకు పెరగనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు 26.9 కోట్లకు సమానం. అంటే వేతనంలో ఏకంగా 64 శాతం పెరుగుదల నమోదవుతోంది.
నాయకుల పనితీరు, బాధ్యతలను బట్టి వేతన సర్దుబాటు :
ఈ పెంపు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే మొత్తం పెరిగిన మొత్తాన్ని వెంటనే అందుకోకుండా, నాయకుల పనితీరు, బాధ్యతలను బట్టి వేతన సర్దుబాటు దశలవారీగా ఉంటుంది. సింగపూర్ ప్రభుత్వం రాజకీయ నాయకుల వేతనాలను దేశంలోని అత్యధిక ఆదాయం పొందే ప్రైవేట్ రంగ నిపుణుల సంపాదనతో అనుసంధానించే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడం, అవినీతి ప్రమాదాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.

ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ నేతల వేతనాలపై మరోసారి చర్చ మొదలైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నెలవారీ వేతనం, వివిధ అలవెన్సులతో కలిపి సుమారు 1.6-1.66 లక్షలుగా, వార్షికంగా దాదాపు 19.2-20 లక్షలుగా పలు వనరులు పేర్కొంటున్నాయి.
వాంగ్ మాత్రం తనకు పెరగనున్న అదనపు ఆదాయాన్ని తదుపరి ఐదేళ్ల పాటు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక రాజకీయ వేతనాలు అందుతున్న సింగపూర్‌లో మరో భారీ పెంపు ప్రకటించడంపై అక్కడ ప్రజల్లో చర్చ, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సమర్థవంతమైన పాలనకు ప్రతిభావంతులైన నాయకత్వం అవసరమని, అందుకు పోటీ వేతనాలు కీలకమని సమర్థిస్తోంది. అందువల్ల తాజా పెంపు అమల్లోకి వచ్చిన తర్వాత లారెన్స్ వాంగ్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే ప్రభుత్వ అధినేతగా మరింత స్పష్టంగా నిలవనున్నారు.
1000కుపైగా విమానాలు రద్దు.. బ్రిటన్‌లో ప్రయాణికుల తిప్పలు..!

