Prakash Raj: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో జనసేన పార్టీ శ్రేణుల ప్రవర్తనను తప్పుబడుతూ ఆయన శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
"ప్రశ్నించే వారిని చంపేస్తారా ఏంటి? ఇది గుండాయిజం కాదా?" అంటూ నిలదీశారు. జనసైనికుల తీరు రౌడీయిజంలా ఉందంటూ ఆరోపించిన ఆయన, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

దేశమంతా గమనిస్తోంది.. పద్ధతి మార్చుకోండి!
ఈ వివాదంలో జనసేన కార్యకర్తలు హద్దులు దాటి అతిగా ప్రవర్తిస్తున్నారని, పద్ధతిగా మెలగాలని ప్రకాశ్ రాజ్ హితవు పలికారు. తప్పు ఒప్పులను న్యాయస్థానాలు తేలుస్తాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దేశం మొత్తం నిశితంగా గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.
Prakash Raj: అసలు ఏం జరిగిందంటే..?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (ప్రశాంత్ రావణ్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను పిఠాపురానికి తరలించగా, అక్కడ ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, జనసేన శ్రేణులు పెట్టిన మరో కేసులో పోలీసులు ఆయన్ను తక్షణమే మళ్లీ అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తరలించడంతో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. ఈ రాజకీయ ఘర్షణల నేపథ్యంలోనే జనసైనికులపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

