Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియాంక గాంధీ పేరుతో రూ.3 కోట్ల మోసానికి యత్నం!

ప్రియాంక గాంధీ పేరుతో రూ.3 కోట్ల మోసానికి యత్నం!

వార్త 3 weeks ago

Priyanka Gandhi : కాంగ్రెస్‌ కీలక నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత కార్యదర్శిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కేరళ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రూ.3 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించాడు.

వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తున్నారు. ప్రియాంక గాంధీ ఢిల్లీ కార్యాలయంలో ఆమె వ్యక్తిగత కార్యదర్శి డీఎస్‌ రాజ్‌కుమార్‌గా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. జూలై 6న కేరళలోని ఏలత్తూర్ ఎమ్మెల్యే కె. విద్యా బాలకృష్ణన్‌కు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలిపాడు. రూ.3 కోట్లు ఇస్తే ఆమెకు మంత్రి పదవి ఇప్పించేలా చూస్తానని ఆశ కల్పించాడు. కోజికోడ్‌కు చెందిన మరో ఎంపీ ఆమె పేరును సూచించినట్లు అతడు చెప్పాడు. కాగా, అనుమానం రావడంతో ఎమ్మెల్యే విద్యా బాలకృష్ణన్ ఆ ఎంపీతో పాటు ప్రియాంక గాంధీ కార్యాలయాన్ని సంప్రదించారు. తనకు కాల్ చేసిన వ్యక్తి రాజ్‌కుమార్‌గా నమ్మించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే ఫిర్యాదుతో కోజికోడ్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 Priyanka Gandhi

మరోవైపు కేరళ ఎంపీలు షఫీ పరంబిల్, డీన్ కురియకోస్‌తో పాటు పలు కాంగ్రెస్‌ నేతలను ఆ వ్యక్తి సంప్రదించినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీ కార్యాలయ కార్యదర్శి రాజ్‌కుమార్‌ దీనిపై స్పందించారు. కేరళ రాష్ట్ర పోలీస్ చీఫ్, వయనాడ్ ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి తన గుర్తింపు, ప్రియాంక గాంధీ వాద్రా కార్యాలయం పేరు దుర్వినియోగం చేస్తున్నాడని, డబ్బు డిమాండ్‌ చేసి ప్రజాప్రతినిధులను మోసగించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం వయనాడ్‌లో కూడా కేసు నమోదైంది. అయితే ఢిల్లీ నుంచి వాట్సాప్‌ కాల్‌ చేసిన ఆ వ్యక్తి ఉపయోగించిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఒక అనుమానితుడ్ని గుర్తించినట్లు కేరళ పోలీస్‌ అధికారి తెలిపారు. నకిలీ గుర్తింపు పత్రాలతో సిమ్ కార్డు కొనుగోలు చేశాడా? అని అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఢిల్లీకి పంపిస్తామని పోలీస్‌ అధికారి వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

ఎన్డీయే '360' కల నిజమై భారత రాజకీయ ముఖచిత్రం మారబోతోందా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha