Pune Businessman: భార్యకు తెలియకుండా ప్రియురాలితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసిన ఓ వ్యాపారవేత్త వ్యవహారం చివరకు పోలీసుల వరకు వెళ్లింది.
ప్రియురాలి పాస్‌పోర్ట్ సమస్య కారణంగా ప్రయాణం ఆగిపోవడంతో.. తన అసలు విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో అతడు కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. చివరికి తానే పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది.
Read Also :Tamil Nadu Schools: ప్రభుత్వ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదన

కౌలాలంపూర్ టూర్ అంటూ భార్యకు చెప్పి..
పుణేకు చెందిన 46 ఏళ్ల లాండ్రీ వ్యాపారవేత్త సెప్టెంబర్ 14న కౌలాలంపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే భార్యకు మాత్రం బిజినెస్ పని నిమిత్తం మలేషియా వెళ్తున్నట్లు చెప్పాడు. వాస్తవానికి తన ప్రియురాలితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇద్దరూ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో అసలు సమస్య బయటపడింది.
ప్రియురాలి పాస్‌పోర్ట్‌తో ఇమ్మిగ్రేషన్ వద్ద అడ్డంకి
ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రియురాలి పాస్‌పోర్ట్‌ను పరిశీలించగా.. గతంలో పోగొట్టుకున్నట్లు ప్రకటించిన పాత పాస్‌పోర్ట్‌ను ఆమె ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అధికారులు నిలిపివేశారు. ఈ పరిణామంతో వ్యాపారవేత్త తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాకుండా.. తాను వేరే మహిళతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో మరో నాటకానికి తెరతీశాడు.
ఎయిర్‌పోర్ట్ నుంచే భార్యకు ఫోన్
విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే ముందు ఎయిర్‌పోర్ట్ ల్యాండ్‌లైన్ ద్వారా భార్యకు ఫోన్ చేశాడు. ఇమ్మిగ్రేషన్ సమస్య కారణంగా తన మొబైల్ ఫోన్‌ను అధికారులు తీసుకున్నారని ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ప్రియురాలితో కలిసి దక్షిణ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)కు వెళ్లిపోయాడు. మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా భార్యతో మాట్లాడి ఇదే విషయాన్ని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
భార్య ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు
భర్త నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తనపై కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త అదే రోజు రాత్రి ఎయిర్‌పోర్ట్ పరిధిలోని సహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Pune Businessman: భార్యకు విషయం తెలియకూడదనే అబద్ధం
విచారణలో ఇమ్మిగ్రేషన్ సమస్య కారణంగా తన ప్రయాణం రద్దయిందని, భార్యకు అసలు విషయం తెలియకుండా ఉండేందుకే మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అబద్ధం చెప్పినట్లు వ్యాపారవేత్త అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 'C Summary' క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నట్లు సహార్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. కేసు పొరపాటుగా నమోదైనప్పుడు లేదా ఆరోపణలు పూర్తిగా నిజం కాదని తేలిన సందర్భాల్లో ఈ తరహా క్లోజర్ రిపోర్టును సమర్పిస్తారని అధికారి వివరించారు.
వ్యక్తిని హత్య చేసి.. 'నేను క్షేమంగా ఉన్నాను' అని కుటుంబానికి మెసేజ్ పంపిన హంతక జంట!

