Harish Rao: తెలంగాణ రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22ఏ) పేరుతో బహిరంగంగా వేధింపులు, దందాలు సాగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన బహిరంగ లేఖ రాశారు.
చట్టప్రకారం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన ఈ నిబంధనను, ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి డబ్బులు గుంజడానికి వాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో ఆస్తుల బ్లాకింగ్
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి ప్రారంభించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్లాట్లు మరియు నివాసాలను ఏకపక్షంగా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూములను, క్లియర్ టైటిల్ పత్రాలు ఉన్న ఆస్తులను మళ్లీ బ్లాక్ చేయడం ద్వారా సామాన్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
Harish Rao: రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ల రాకెట్
రెవెన్యూ శాఖలో ఏకంగా 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. 22ఏ జాబితా నుంచి భూములు తొలగించాలంటే మార్కెట్ విలువలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఓఆర్‌ఆర్ పరిసరాల్లోని విలువైన భూములను బ్లాక్ చేసి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు చేసుకోవాలని యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను ఈ జాబితాలో చేర్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్
ఈ అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీశ్ రావు గట్టిగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 22ఏ జాబితాలో చేర్చిన మరియు తొలగించిన ప్రతి భూమి వివరాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరారు. జిల్లాల వారీగా ఈ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి పారదర్శకత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
Epaper: epaper.vaartha.com
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు.. వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు

