PIB Fact Check : రాఖీ పండగ సందర్భంగా పీఎం కిసాన్ (PM Kisan) నిధుల విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
రాఖీ పండుగ రోజున రైతుల ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు జమ అవుతాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి (PIB Fact Check) నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) తేల్చిచెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆ వీడియోలు పూర్తిగా నకిలీవని, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లుగా వీడియో :
ప్రస్తుతం సోషల్ మీడియాలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైతుల ఖాతాల్లో ఏకంగా నాలుగు వేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఈ నకిలీ వీడియోలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. రాఖీ పండగ కానుకగా ఎలాంటి ప్రత్యేక నిధులు లేదా అదనపు మొత్తాలు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నిజానికి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్రం ఒక నిర్దిష్టమైన విడతల విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన విజయవంతంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా ఈ నిధులు జమ అయ్యాయి. ఆ తర్వాత రావలసిన తదుపరి 24వ విడత నిధుల విడుదల తేదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక షెడ్యూల్ లేదా ప్రకటన రాలేదు.
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వీడియోలు, వదంతులను రైతులు నమ్మవద్దని కోరారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్, లబ్ధిదారుల జాబితా లేదా పేమెంట్ స్టేటస్ వంటి వివరాల కోసం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ అయిన pmkisan.gov.in పోర్టల్‌ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఈకేవైసీ (eKYC) ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా అర్హులైన రైతులు తమ తదుపరి విడత నిధులను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

