Raksha Bandhan : రాఖీ పౌర్ణమి (Raksha Bandhan ) పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది.
పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి అదనంగా 240 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు :
రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన కేంద్రాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో అవసరాన్ని బట్టి డిపోల నుంచి మరిన్ని బస్సులను వెంటనే నడిపించాలని మంత్రి ఆదేశించారు.

పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణాలపై కూడా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి 31వ తేదీ సోమవారం వరకు హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు తిరిగి వచ్చే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు బస్సులను కేటాయించాలని మంత్రి సూచించారు.
ఇక మహిళా ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళల ప్రయాణం పెరిగే అవకాశం ఉన్నందున ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాలని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

