Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు శతాబ్దకాలంగా రాయలసీమ మరియు దక్షిణ కర్ణాటక ప్రాంత ప్రజలు కలలుగన్న మహా అభివృద్ధి రహదారి.
ఉమ్మడి గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంగా ఉన్న రోజుల్లోనే గుంతకల్లు-రాయదుర్గం-మడకశిర-పావగడ-తుమకూరు మార్గంపై తొలి ఆలోచనలు జరిగాయి.
అప్పట్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్న మంత్రి లక్ష్మీదేవి, రైల్వే బోర్డు కమిటీ సభ్యుడు అపర్ణ నరసింహులు ఈ రైలు మార్గం కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే, ఆ కాలంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆర్థిక సాధ్యత (Financial Viability) లేకపోవడం మరియు బ్రిటిష్ పాలన అనంతర ప్రాధాన్యతల కారణంగా ఈ ప్రతిపాదనలు కేవలం ఫైళ్లకే పరిమితమయ్యాయి.
Read also: Train Accident: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కళ్యాణదుర్గానికి 'రఘువీరారెడ్డి' మార్క్ అభివృద్ధి
ఈ నేపథ్యంలో, 2009లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేసిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నియోజకవర్గ రూపురేఖలను మార్చారు. కళ్యాణదుర్గం కరువుకు శాశ్వత పరిష్కారంగా జీడిపల్లి నుండి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా 114 చెరువులకు సాగునీరు అందించే బృహత్ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. తిమ్మసముద్రం వద్ద 1100 ఎకరాల పారిశ్రామిక భూసేకరణ, కళ్యాణదుర్గం రింగ్ రోడ్డు, శ్రీరామ్ రెడ్డి మంచినీటి పథకం, లక్ష్మీదేవి కృషి విజ్ఞాన కేంద్రం మరియు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO Office) ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగాయి.
కళ్యాణదుర్గానికి కలగా మిగిలిపోయిన రైల్వే లైన్ కోసం రఘువీరారెడ్డి పట్టుదలతో పెద్ద పోరాటమే చేశారు. దీని ఫలితంగానే అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు, మడకశిర, పావగడ, మధుగిరి మీదుగా కర్ణాటకలోని తుమకూరును కలిపే రైల్వే మార్గం మంజూరైంది. అందుకే ఈ మార్గాన్ని ప్రజలు “రఘువీరారెడ్డి గారి కలల ప్రాజెక్టు”గా పిలుచుకుంటారు. ఇటీవల దొడ్డహళ్ళి – పావగడ మధ్య లైన్ ఇన్‌స్పెక్షన్ (Line Inspection) దశకు చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
Rayadurgam Tumakuru Railway: ప్రాజెక్టు నేపథ్యం – శంకుస్థాపన
రాయలసీమ ప్రజల రవాణా అవసరాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, విద్యార్థులు మరియు ఉద్యోగార్థుల ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2006-07 రైల్వే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. అనంతరం 2011-12 కాలంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ప్రారంభంలో రూ.857 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయం, కాలయాపన కారణంగా ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఈ మార్గం పూర్తయితే బెంగళూరు-బళ్లారి మధ్య దూరం తగ్గడమే కాకుండా కళ్యాణదుర్గం, మడకశిర, పావగడ వంటి వెనుకబడిన ప్రాంతాలు రైల్వే మ్యాప్‌లోకి వస్తాయి.
కీలక పాత్ర పోషించిన నాయకులు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి రాష్ట్ర మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి, అనంతపురం లోక్‌సభ సభ్యులు అనంత వెంకటరామిరెడ్డి జట్టు కట్టి విశేష కృషి చేయడంతో ఈ ప్రాజెక్టుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లభించింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేసింది. అప్పటి కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ శంకుస్థాపన చేయగా, కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కె.హెచ్. మునియప్ప ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆలస్యానికి ప్రధాన కారణాలు..
ఈ ప్రాజెక్టు అమలులో ప్రధాన అడ్డంకిగా మారింది ‘భూసేకరణ’ (Land Acquisition). ముఖ్యంగా కర్ణాటకలోని తుమకూరు, పావగడ, మధుగిరి ప్రాంతాల్లో రైతులు అధిక పరిహారం కోరుతూ ఉద్యమాలు చేపట్టారు. భూ రికార్డుల సమస్యలు, పరిహారం చెల్లింపుల్లో జాప్యం, పరిపాలనా అనుమతుల ఆలస్యం కారణంగా పనులు సంవత్సరాల తరబడి కుంటుపడ్డాయి.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం రాయదుర్గం వైపు నుంచి గణనీయమైన ట్రాక్ నిర్మాణం పూర్తయింది. పలు సెక్షన్లలో రైల్వే ట్రాక్, వంతెనలు, స్టేషన్ భవనాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజా అధికారిక సమాచారం ప్రకారం భూసేకరణ 96 శాతానికి పైగా పూర్తి కాగా, మిగిలిన పనులను వేగవంతం చేస్తున్నారు.

కళ్యాణదుర్గం-అనంతపురం రైల్వే లైన్ కోసం ప్రజల డిమాండ్
కళ్యాణదుర్గం నుండి అనంతపురం నగరానికి కేవలం 55 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ రెండింటి మధ్య రైల్వే లింక్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా కోరుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలకంఠాపురం రఘువీరారెడ్డి కూడా కళ్యాణదుర్గం-అనంతపురం మధ్య రైల్వే మార్గాన్ని విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఈ చిన్న లింక్ కనెక్ట్ అయితే వెనుకబడిన రాయదుర్గం, పావగడ, మధుగిరి ప్రాంతాలు జిల్లా కేంద్రమైన అనంతపురంతో నేరుగా అనుసంధానమై, మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రజలు, వాణిజ్య వర్గాలు ప్రస్తుత పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

