Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిణామాల నేపథ్యంలో, ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు రానున్నారు.
స్వదేశంలో అధికారం కోల్పోయి ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, బుధవారం ఢిల్లీ నుండి వర్చువల్ వేదికగా విలేకరులతో మాట్లాడనున్నారు. 2024లో బంగ్లాదేశ్‌లో తలెత్తిన చారిత్రాత్మక విద్యార్థి ఉద్యమం కారణంగా ఆమె పదవికి వీడ్కోలు పలికి దేశం విడిచి వచ్చిన విషయం విదితమే.

పదవి కోల్పోయిన రెండేళ్ల తర్వాత తొలి ప్రసంగం
బంగ్లాదేశ్‌ను వీడి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని షేక్ హసీనా ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆమె భారత్‌కు చేరుకున్న తర్వాత బహిరంగంగా ప్రసంగించడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ వర్చువల్ సమావేశంపై అంతర్జాతీయంగా మరియు ఇరు దేశాల రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Sheikh Hasina: భారత విదేశాంగ శాఖ స్పష్టత
ఈ మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం మాత్రమేనని ఆయన వెల్లడించారు. హసీనా విలేకరుల సమావేశంపై ఎలాంటి అధికారిక జోక్యం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌మీట్ అంశంపై స్పష్టత ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

