Rythu Bharosa Funds Release: తెలంగాణలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో..
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసింది. జూన్ 30 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ప్రముఖ శిల్పకళా వేదిక (Shilpakala Vedika) లో ఈ ప్రతిష్టాత్మక ‘రైతు ఆశీర్వాద సభ’ ను అత్యంత అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేదిక మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేవలం ప్రతికూల వాతావరణం వల్లే సభా వేదిక మారిందని.. అంతేకాని రైతు భరోసా నిధుల విడుదల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధుల విడుదల
రేపు సాయంత్రం జరగబోయే ఈ రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన కంప్యూటర్ బటన్ నొక్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతి ద్వారా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.
అధికారుల ముమ్మర ఏర్పాట్లు
ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణీత సమయానికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా సాంకేతిక, పరిపాలనాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు వెల్లడించారు. లబ్ధిదారులైన అర్హత గల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాంకింగ్ సర్వర్లు సజావుగా పనిచేసేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వానాకాలం సాగు పనులు ఊపందుకున్న తరుణంలో.. ఈ పెట్టుబడి సాయం సకాలంలో అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

