CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
జూన్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు (ఆదివారం) ఉదయం బెంగళూరు నగరం నుంచి ఆయన నేరుగా సింగపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనకు వెళుతోంది.
Read Also : Tuni Missing Child Jnaneswari: ఏడు రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ!
CM Chandrababu on a two-day visit to Singapore
CM Chandrababu: సింగపూర్ ప్రధాని, కీలక మంత్రులతో చంద్రబాబు భేటీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారితో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి షణ్ముగమ్ వంటి అత్యంత కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను వారికి సీఎం వివరించనున్నారు. అంతకంటే ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చంద్రబాబు చర్చించనున్నారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌పై చర్చ
రాష్ట్రంలో ఐటీ, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేసేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. గతంలో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు.
వరల్డ్ సిటీస్ సమ్మిట్..
పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 2026లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బిజినెస్ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. రెండు రోజుల పాటు అత్యంత బిజీ షెడ్యూల్‌తో సాగే ఈ పర్యటనను ముగించుకుని జూన్ 16న రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ (CRDA) అధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొని సీఎంకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

