KTR vs Revanth : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
‘2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనలో అవకతవకలకు పాల్పడిన గ్లోబరీనా (Globarena) సంస్థ కేటీఆర్ బినామీ కంపెనీ’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ లీగల్ నోటీసులు పంపుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు. నాకు లేదా మా బిఆర్ఎస్ పార్టీకి గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

తప్పుడు ప్రచారాలతో సీఎం పదవి గౌరవం తగ్గిస్తున్నారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప, అధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయకూడదని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా ప్రవర్తించాలని ఎద్దేవా చేశారు. పరీక్షల పేపర్ లీకేజీలు మరియు ఫలితాల నిర్వహణ అంశాలపై నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం తమపై లేనిపోని బురదజల్లే ప్రయత్నాలను సహించేది లేదని, ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

