Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు బహిరంగ లేఖ.. రైతు సమస్యలపై ఆగ్రహం

రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు బహిరంగ లేఖ.. రైతు సమస్యలపై ఆగ్రహం

వార్త 3 days ago

KTR Open Letter: తెలంగాణలో ప్రస్తుతం వరి పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రస్థాయిలో నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు తెరిచారు.

రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక ఘాటు బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, రైతాంగ సమస్యలపై తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు రంగాన్ని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం కొద్ది నెలల్లోనే కన్నీటి సేద్యంగా మార్చేసిందని ఆయన ఆరోపించారు.

Read Also : TG CM: మైనర్ బాలిక ఘటనపై కేసీఆర్ మౌనం ఎందుకు?: సీఎం రేవంత్ రెడ్డి ఘాటు ప్రశ్నలు!

 KTR’s harsh open letter to Revanth Reddy..

KTR Open Letter: రాష్ట్రవ్యాప్తంగా పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే వారాల తరబడి పడిగాపులు కాస్తూ, తీవ్ర ఆవేదనతో గుండెపగిలి కుప్పకూలుతున్నా ప్రభుత్వానికి కనీస స్థాయి లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి 70 సార్లు ఢిల్లీ చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధలో.. కనీసం ఒక్క శాతం కూడా రైతుల ప్రయోజనాలపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఐకేపీ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతకు, వడదెబ్బకు తోడు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం వల్ల దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్ నుంచి ఖమ్మం దాకా రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోజుకు కనీసం ఒక్క లారీ ధాన్యం లోడ్ కూడా ఎత్తడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. అడపాదడపా కొనుగోళ్లు జరిపే చోట కూడా మిల్లు యజమానులు క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. చివరికి ధాన్యం నింపే గోనె సంచులు కోసం రైతుల నుంచే ₹50 డిపాజిట్ వసూలు చేసే దుస్థితికి తీసుకురావడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో కల్లాల వద్దకే వెళ్లి కొన్నాం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మూడు నెలల ముందే ప్రణాళికలు వేసి, కరోనా కష్టకాలంలోనూ రైతుల కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా భరోసా ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి కనీసం టార్పాలిన్లు కూడా సమకూర్చలేకపోతోందని, దీనివల్ల రైతులు కళ్లముందే ధాన్యం కొట్టుకుపోతుంటే నిస్సాహాయ స్థితిలో ఏడుస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు ₹500 బోనస్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం మద్దతు ధర కూడా కల్పించలేకపోతే రైతులకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు, రాస్తారోకో జరగని రహదారి లేదన్న కేటీఆర్… ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు కాంగ్రెస్ సర్కారుకు గట్టిగా వాతలు పెడతారని హెచ్చరించారు. అన్నదాతల చేతిలోనే ఈ ప్రభుత్వ కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో చరిత్రలో రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఒక ‘రైతు ద్రోహి’గానే మిగిలిపోతారని కేటీఆర్ హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏసీబీ వలలో బోయిన్‌పల్లి మహిళా ఎస్సై: రూ. 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha