Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.2 వేలు దాటిన UPI పేమెంట్లపై ఛార్జీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్లపై ఛార్జీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

వార్త 1 week ago

UPI Transaction Charges: యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు.

MDR ఛార్జీని వినియోగదారులపై అదనపు భారం రూపంలో మోపబోమని ఆమె తెలిపారు. రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట యూపీఐ వ్యాపార లావాదేవీలకు MDR వర్తించినప్పటికీ.. ఆ రుసుము పేమెంట్ వ్యవస్థలోని వ్యాపారులు, సంబంధిత సంస్థల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.

Read Also :Gold Rate Today: నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

అక్టోబర్ 15 నుంచి కొత్త MDR నిబంధనలు

కేంద్రం ప్రకటించిన కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అన్ని UPI చెల్లింపులపై ఈ ఛార్జీ ఉండదు. Person-to-Person (P2P) లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి. రూ.2,000 వరకు ఉండే అనేక మర్చంట్ లావాదేవీలు కూడా ఛార్జీ లేకుండానే కొనసాగుతాయి.

కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు తీసుకోరాదు

MDRపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో సాధారణ UPI వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. MDRను కస్టమర్లపైకి బదిలీ చేయడానికి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులకు అనుమతి ఉండదని కేంద్రం పేర్కొంది. అంటే ఒక వినియోగదారు వ్యాపారికి రూ.5,000ను UPI ద్వారా చెల్లిస్తే.. MDR పేరుతో కస్టమర్ నుంచి అదనంగా మరో మొత్తాన్ని వసూలు చేయడం ఈ విధానంలో భాగం కాదు.

MDR అంటే ఏమిటి?

MDR అంటే Merchant Discount Rate. డిజిటల్ చెల్లింపును ప్రాసెస్ చేయడానికి చెల్లింపు వ్యవస్థలోని భాగస్వామ్య సంస్థల మధ్య వర్తించే రుసుమే MDR. ఇది కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను, సెస్ లేదా సర్‌చార్జ్ కాదు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం MDR ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేసి ఖజానాలో జమ చేయదు. ఈ మొత్తాన్ని బ్యాంకులు, పేమెంట్ యాప్ ప్రొవైడర్లు, ఇతర చెల్లింపు వ్యవస్థ భాగస్వాముల మధ్య పంపిణీ చేసి UPI మౌలిక సదుపాయాల నిర్వహణ, విస్తరణకు ఉపయోగిస్తారు.

96 శాతం మర్చంట్ లావాదేవీలపై ప్రభావం ఉండదు

కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, కొత్త నిబంధనల తర్వాత కూడా సుమారు 96 శాతం P2M UPI లావాదేవీలు ఎలాంటి MDR ప్రభావానికి లోనుకావు. చిన్న వ్యాపారులకు వర్తించే జీరో-MDR నిబంధనలు కూడా కొనసాగుతాయి. అందువల్ల UPI ఉపయోగించే సాధారణ ప్రజల రోజువారీ చిన్న మొత్తాల చెల్లింపులపై కొత్త MDR ప్రభావం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

UPI Transaction Charges: UPI వినియోగదారులకు ఏమి మారుతుంది?

మొత్తంగా చూస్తే.. సాధారణ వినియోగదారులు UPI ద్వారా డబ్బులు పంపేటప్పుడు లేదా షాపుల్లో QR కోడ్ స్కాన్ చేసి చెల్లించేటప్పుడు అదనపు UPI ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త MDR ప్రధానంగా నిర్దిష్ట పెద్ద విలువ కలిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినది. అయితే వినియోగదారులు చెల్లింపు సమయంలో వ్యాపారి అదనపు ఛార్జీ కోరితే.. దాని వివరాలను పరిశీలించడం, అవసరమైతే సంబంధిత బ్యాంకు లేదా పేమెంట్ యాప్‌కు ఫిర్యాదు చేయడం మంచిది.

'ది డైమండ్ కలెక్టివ్'గా నూతన అధ్యాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha