Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.700 కోసం ప్రాణం తీశాడు.. గంటల్లోనే పోలీసుల ఛేదన

రూ.700 కోసం ప్రాణం తీశాడు.. గంటల్లోనే పోలీసుల ఛేదన

వార్త 2 weeks ago

Delhi Crime: రాజధాని ఢిల్లీలో అత్యంత క్షూద్రమైన కారణంతో ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కేవలం రూ. 700 చిన్న అప్పు విషయమై తలెత్తిన వివాదం కాస్తా ముదిరి ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది.

రోహిణి జిల్లా పరిధిలోని భరత్ విహార్‌కు చెందిన ముకేశ్ యాదవ్ (30) అనే వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఆదివారం బేగంపూర్ విహార్ ప్రాంతం సమీపంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుడు

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ముకేశ్‌ను కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా ఉన్న అగ్రసేన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే అదపులోకి తీసుకురావడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక, చికిత్స పొందుతూ ముకేశ్ సోమవారం తెల్లవారుజామున 2:18 గంటలకు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.

Delhi Crime: హత్యకు అసలు కారణం బయటపెట్టిన పోలీసు విచారణ

ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని మృతుడి సోదరుడు సతీశ్ ద్వారా పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ప్రధాన నిందితుడైన సచిన్ అలియాస్ సాగర్ వద్ద సతీశ్ రూ. 700 అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులు వెంటనే తిరిగి చెల్లించాలని సచిన్ నిలదీయగా, ఆ సమయంలో ముకేశ్ జోక్యం చేసుకుని మాట్లాడాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగి తీవ్ర ఆగ్రహానికి గురైన సచిన్, తన స్నేహితులతో కలిసి కుట్ర పన్ని ముకేశ్‌పై కత్తులతో దాడికి పాల్పడినట్లు తేలింది.

కేవలం రెండు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

ఈ దారుణ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఏసీపీ సార్థక్ త్యాగి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టెక్నికల్ సర్వైలెన్స్ టెక్నాలజీని ఉపయోగించి నిందితుల కదలికలను పసిగట్టారు. స్థానిక ప్రాంతాలతో పాటు వివిధ ఓయో హోటళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి ప్రధాన నిందితుడు సచిన్ (29)తో పాటు అతడి సహచరులు పంకజ్ (23), అభిషేక్ (22)లను కేవలం రెండు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి వస్తువుల స్వాధీనం మరియు పాత నేర చరిత్ర

నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు అలాగే రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు రోహిణి అదనపు డీసీపీ సతీశ్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్‌కు ఇప్పటికే పాత నేర చరిత్ర ఉందని, అతడిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 10 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం కింద తగిన కేసులు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతంపై తీర్మానం.. పార్టీలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha