SIR : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ సక్రమంగా లేక తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు రాష్ట్ర సీఈఓలకు లేఖ రాశారు.
ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాని లబ్ధిదారులు తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించేందుకు వీలుగా నిబంధనలలో సరళీకరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉపాధి, విద్య మరియు ఇతర పనుల నిమిత్తం సొంత ఊళ్లకు దూరంగా ఉండే అర్హులైన ఓటర్లు నోటీసుల సమయానికి స్వయంగా హాజరుకావడం సాధ్యపడదని, కాబట్టి వారి స్థానంలో తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు అవసరమైన ఆధారాలు సమర్పించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు.

స్పష్టమైన సమాచారం మరియు బీఎల్ఓల పాత్రపై విజ్ఞప్తి
అలాగే ఓటర్లకు అందిస్తున్న నోటీసులలో అధికారులు ఎవరిని కలవాలి, దరఖాస్తులు సమర్పించాల్సిన వేదిక (ప్రాంగణం), తేదీ మరియు సమయం వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ తమ వినతిపత్రంలో స్పష్టం చేసింది. సాధారణ ఓటర్లు నేరుగా ఉన్నతాధికారులను కలవడంలో ఇబ్బందులు పడుతున్నందున, స్థానిక బూత్ స్థాయి అధికారులకే (BLO) నేరుగా పత్రాలు అందజేసే ప్రక్రియను అమలు చేయాలని సూచించింది. వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయాన్ని మాత్రమే ఈఆర్ఓ (ERO) లేదా ఏఈఆర్ఓ (AERO) లు తీసుకునేలా సరళమైన విధానాన్ని రూపొందిస్తే అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉంటారని పేర్కొంది.

