Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) శుభవార్త అందించింది. యాత్రికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో రూ.2 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. శబరిమల యాత్రకు వచ్చిన భక్తుల్లో ఎవరైనా అనుకోని కారణాలతో ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందించనున్నారు. ఇప్పటివరకు యాత్రికులకు ప్రమాద బీమా సదుపాయం మాత్రమే ఉండగా, ప్రత్యేకంగా జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా దేవస్థానం బోర్డే చెల్లించనుంది. దీంతో భక్తులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది.
Ayyappa Swamyవర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో వివరాల సేకరణ
ఈ బీమా పథకం అమలులో భాగంగా శబరిమల దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే సమయంలోనే భక్తుల వ్యక్తిగత వివరాలతో పాటు నామినీ వివరాలను కూడా సేకరించనున్నారు. యాత్రికులు నమోదు చేసుకున్న నామినీకి బీమా పరిహారం అందించేలా అవసరమైన ప్రక్రియను రూపొందించనున్నారు. ముఖ్యంగా శబరిమల యాత్రలో భక్తుల రద్దీ, ప్రయాణ ఇబ్బందులు, అనుకోని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప భక్తుల భద్రతతో పాటు వారి కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో ఈ పథకం కీలకంగా మారనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే శబరిమల యాత్రలో ఈ బీమా సదుపాయం వారికి అదనపు భరోసా ఇవ్వనుంది.

