BCCI : శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును BCCI అధికారికంగా ప్రకటించింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఈ సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది.
ఈ జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ చోటు దక్కించుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. వీరిద్దరి రీఎంట్రీతో భారత జట్టుకు బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాల్లో మరింత బలం చేకూరనుంది.
ఈ సిరీస్‌కు సరాన్ష్ జైన్ అనే యువ ఆటగాడికి అవకాశం :
అలాగే ఈ సిరీస్‌కు సరాన్ష్ జైన్ అనే యువ ఆటగాడికి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం కల్పించడం విశేషంగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకున్న ప్రదర్శనకు గుర్తింపుగా అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే అనుభవజ్ఞులను కొనసాగించడం ద్వారా సమతుల్య జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
BCCIశ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుథార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, సరాన్ష్ జైన్ చోటు దక్కించుకున్నారు.
ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి జరుగుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్ట్యా ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకంగా భావిస్తున్నారు. గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారు? బుమ్రా, జడేజా అనుభవం జట్టుకు ఎంత మేర ఉపయోగపడుతుంది? అనే అంశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీలంక గడ్డపై విజయంతో సిరీస్‌ను ప్రారంభించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

