Srinivasa Mangapuram Movie: సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా, 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.
ప్రఖ్యాత వైజయంతి మూవీస్ భాగస్వామ్యంలో రూపొందడం, అలాగే అనిల్ తడాని, రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని హీరోయిన్‌గా పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
Read Also : Ramayana Part 1 Trailer : రామాయణ పార్ట్-1 ట్రైలర్ రిలీజ్..!
‘Srinivasa Mangapuram’ Movie Review!
Srinivasa Mangapuram Movie: కథా నేపథ్యం
పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) తిరుపతిలో ఓ పెద్దమనిషి. తన వారి కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని వ్యక్తిత్వం ఆయనది. అలాంటి పెద్దిరెడ్డి కుమార్తె మంగ (రాశా తడాని) వెంట, అప్పుడే తిరుపతికి వచ్చిన శ్రీను (జై కృష్ణ) పడుతుంటాడు. ఎలాగైనా ఆమె ప్రేమను గెలుచుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) చేతికి శ్రీను చిక్కుతాడు. సుబ్బారెడ్డి అతనికి బుద్ధి చెప్పాలనుకునే సమయంలో ఒక గ్యాంగ్ వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తుంది. కానీ శ్రీను సమయస్ఫూర్తితో వ్యవహరించి సుబ్బారెడ్డిని కాపాడుతాడు.
ఈ విషయంతో శ్రీనును పెద్దిరెడ్డి తన ఇంటికి పిలిపిస్తాడు. ఇంతకీ అసలు ఈ శ్రీను ఎవరు? ఎందుకు మంగను ప్రేమించమని వెంటపడుతున్నాడు? ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కథగా చూసుకుంటే ఇది పూర్తిగా కొత్తదనంతో కూడుకున్నదేమీ కాదు. గతంలో తెలుగు తెరపై ఎన్నోసార్లు చూసిన ఒక లవ్ స్టోరీకి కొంత రివెంజ్ డ్రామాను జోడించి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు అజయ్ భూపతి. ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడిని పరిచయం చేస్తున్న క్రమంలో, పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు.
ఫస్ట్ హాఫ్ ప్రారంభంలోనే హీరో గాయపడటం, ఆ తర్వాత హీరో-హీరోయిన్ల ట్రాక్, పెద్దిరెడ్డి పాత్ర చుట్టూ క్రియేట్ చేసిన సస్పెన్స్‌తో ఆసక్తికరంగానే నడిపించారు. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక అసలు కథ ఎటు వెళుతుందనే విషయంలో దర్శకుడు స్క్రీన్ ప్లేతో కొంత మ్యాజిక్ చేశాడు. అయితే, కథాపాయింట్ బాగా అలవాటైనదే కావడంతో సగటు ప్రేక్షకుడికి అక్కడక్కడా రొటీన్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. క్లైమాక్స్ ఇంకా పవర్‌ఫుల్‌గా, ఊహించని విధంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.
నటీనటుల ప్రదర్శన
ఘట్టమనేని జై కృష్ణకి ఇది ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పవచ్చు. పూర్తిస్థాయి కమర్షియల్ హీరోకి కావాల్సిన డాన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్‌ను చక్కగా పండిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. హీరోయిన్ రాశా తడాని కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.
మోహన్ బాబు స్క్రీన్ పై కనిపంచినంత సేపు తనదైన నటనతో ఆకట్టుకోగా, కిక్ శ్యామ్, వాసుకి, శ్రీ తేజ్, అజయ్, కిల్లి క్రాంతి, వడ్లమాని శ్రీనివాస్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేర మెప్పించారు. నరేష్ కామెడీ సీన్లు నవ్వులు పూయించాయి.
సాంకేతిక విభాగం
దర్శకుడిగా అజయ్ భూపతి కమర్షియల్ ఫార్మాట్‌లో ఫర్వాలేదనిపించినా, మాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్ డిజైనింగ్ మెప్పించాయి. జీవి ప్రకాష్ అందించిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
మొత్తంగా చెప్పాలంటే.. ‘శ్రీనివాస మంగాపురం’ అనేది మాస్ హంగులు, యాక్షన్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

