Abhijit Deepke: రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఓటమి చెందడం తథ్యమని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జోస్యం చెప్పారు.
కేంద్రంలో అధికార మార్పిడి జరగడం వందశాతం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ప్రత్యేక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఎన్నికల సంఘంపై విమర్శలు
దేశంలో ఎన్నికల సంఘం (ECI) పూర్తిగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. కొచ్చిలో జరిగిన 'జంతర్ మంతర్ ఎట్ కొచ్చి' నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తమ అధికారాన్ని కోల్పోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Abhijit Deepke: ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభుత్వ నియంత్రణ: దీప్కే ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యువతను లక్ష్యంగా చేసుకుంటోందని దీప్కే ఆరోపించారు. ప్రజలు ఏం తినాలి? ఎవరిని ప్రేమించాలి? ఏ పార్టీకి ఓటు వేయాలి? అనే విషయాలను కూడా ప్రస్తుత పాలకులే నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలు, సిద్ధాంతాలే ఈ దేశానికి బలమైన పునాదులని ఆయన గుర్తుచేశారు.
త్రివర్ణ పతాకంతో నిరసనలు కొనసాగిస్తాం: నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాతో శాంతియుతంగా నిరసన తెలిపినందుకు తనతో పాటు పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారని దీప్కే గుర్తుచేశారు. తాము ఎక్కడికి వెళ్లినా సరే త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం విశేషం. కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు సాగిన భారీ నిరసన ర్యాలీకి ఆయన నాయకత్వం వహించి సంఘీభావం తెలిపారు.

