Telangana CM : తెలంగాణ రాజకీయంలో బిఆర్ఎస్ (TRS) నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 2009 ఎన్నికల సమయంలో టిడిపితో పొత్తులో భాగంగా కోస్గిలో జరిగిన ప్రచార సభను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఆ నాడు ఒకే వేదికపై నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. ఆనాటి వేదికపై తనతో పాటు పాల్గొన్న ఆ ఇద్దరు నాయకులు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, అది ఒక విచిత్రమైన సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. ప్రజా ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో తాను కూడా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలననే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

మహిళా నాయకత్వం, మాతృస్వామ్య పాలనపై పిలుపు
దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రమే మహిళా ముఖ్యమంత్రి పాలన సాగుతోందని కవిత గుర్తుచేశారు. తెలంగాణ గడ్డపై కూడా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత పెరగాలని, రాష్ట్రంలో మాతృస్వామ్య పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలోనూ, రాజకీయంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే పరిపాలనలో మానవీయ కోణం మరింత విస్తృతమవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర అభివృద్ధిలో భాగాస్వాములు కావాలని, మాతృస్వామ్య భావజాలంతో తెలంగాణను పునర్నిర్మించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

