SIR : తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుండగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 77.66 శాతం మంది ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి వంటి అర్బన్ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ తీవ్ర మందకొడిగా సాగుతోంది. ఈ సమగ్ర పరిశీలన పూర్తయిన తర్వాత రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
SIR Enumeration 40 లక్షల మంది అడ్రస్ నాట్ ట్రేస్డ్.. డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల సంఘం వేటు
గణాంకాల ప్రకారం.. నివాస స్థలాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది ఓటర్లను ‘నాట్ ట్రేస్డ్’ కేటగిరీ కింద గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు డూప్లికేట్ (నకిలీ) ఓట్లు ఉన్నవారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారై ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నవారు మరో 20 లక్షల వరకు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సరైన ఆధారాలు సమర్పించని పక్షంలో వీరి ఓట్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నకిలీ మరియు వలస ఓటర్ల ఏరివేత ద్వారా రాబోయే రోజుల్లో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపుదిద్దుకోనుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

