Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీటు ఖాయమనుకున్న వేళ.. అనంతలోకాలకు ప్రదీప్ మేఘ్వాల్

సీటు ఖాయమనుకున్న వేళ.. అనంతలోకాలకు ప్రదీప్ మేఘ్వాల్

వార్త 1 week ago

Pradeep Meghwal Rajasthan: వైద్య రంగంలో స్థిరపడాలనే బలమైన ఆకాంక్షతో రాత్రింబవళ్లు కష్టపడిన విద్యార్థుల జీవితాల్లో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం చీకట్లను నింపింది.

పరీక్షల నిర్వహణలో తలెత్తిన అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడమే కాకుండా, పలువురు ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది.

Read Also:NEET Exam: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్: పరీక్షా కేంద్రాల మార్పునకు మే 21 వరకు ఛాన్స్!

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా గూఢా గౌడ్జీ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ప్రదీప్ మేఘ్వాల్ గత మూడేళ్లుగా సీకర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో నీట్ పరీక్ష కోసం కఠినంగా శ్రమించాడు. మే 3వ తేదీన జరిగిన పరీక్షను అతను ఎంతో అద్భుతంగా రాశాడు. మొత్తం 720 మార్కులకు గానూ తనకు ఖచ్చితంగా 650కి పైగా మార్కులు వస్తాయని, ఈసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రావడం ఖాయమని ఎంతో భరోసాతో ఉన్నాడు. అయితే, పరీక్ష రద్దయిందనే వార్త వినడంతో అతను తీవ్ర నిరాశలోకి జారిపోయాడు. తన భవిష్యత్తు శూన్యంగా మారబోతుందనే భయంతో, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోదరి స్కార్ఫ్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తన కొడుకు ఎంతో కష్టపడి చదివాడని, ఈ రద్దు నిర్ణయమే తన బిడ్డను పొట్టనబెట్టుకుందని తండ్రి రాజేష్ కుమార్ కన్నీరుమున్నీరయ్యారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పరంపర

ఒక్క రాజస్థాన్‌లోనే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన 21 ఏళ్ల రితిక్ మిశ్రా కూడా గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మూడవ ప్రయత్నంలో మెరుగైన మార్కులు సాధిస్తాననే నమ్మకంతో ఉన్న అతనికి ఈ రద్దు నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీసింది. ఇవే కాకుండా, ఢిల్లీలోని ఆజాద్‌పూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి కూడా నీట్ గందరగోళం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. అటు సౌత్ గోవాలోని మర్గావ్ ప్రాంతంలో 17 ఏళ్ల విద్యార్థిని.. నీట్ పరీక్ష ఒత్తిడిని మరియు తనకు ఇష్టమైన హాకీ క్రీడను బ్యాలెన్స్ చేయలేననే భయాందోళనతో బుధవారం ప్రాణాలు తీసుకుంది.

Pradeep Meghwal Rajasthan: స్పందించిన నేతలు.. జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహణ

ఈ వరుస విషాదాలపై రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు దేశంలో యువతను మానసికంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర స్పందిస్తూ.. రద్దయిన నీట్ యూజీ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది నుండి ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను పూర్తిగా ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలోకి మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha