Spain train accident: స్పెయిన్ దేశంలో సంభవించిన ఘోర రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 68కి చేరుకుంది. రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణ దిశగా సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోలెడో ప్రావిన్స్ పరిధిలోని ఉర్దా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పట్టాలపై నిలిచివున్న ‘ఇర్యో’ హైస్పీడ్ రైలును, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ‘రెన్ఫే’ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ప్రభావం వల్ల రైలులోని పలు బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి.

క్షతగాత్రులు మరియు సహాయక చర్యలు
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 58 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. వీరిలో సుమారు 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరో 50 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుబడి ఉన్నారేమోనని గుర్తించడానికి ప్రత్యేకంగా స్నిఫర్ డాగ్స్ (జాగిలాల) సాయంతో ముమ్మరంగా అన్వేషిస్తున్నారు.
Spain train accident: ప్రమాదానికి సాంకేతిక కారణాలు
ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమికంగా కంప్యూటర్ కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని అధికారులు నిర్ధారించారు. కమ్యూనికేషన్ ఫెయిల్ కావడం వల్ల సేఫ్టీ సిస్టమ్ పనిచేయలేదని తేలింది. అయితే, సిగ్నల్ రెడ్‌గా ఉన్నప్పటికీ కంట్రోల్ రూమ్ నుంచి రైలు ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడం పట్ల స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా “వివరించలేని చర్య” అని పేర్కొంటూ, ఈ ప్రమాదం వెనుక అసలు నిజాలు నిగ్గు తేల్చడానికి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
భారత ఎంబసీ హెల్ప్‌లైన్ మరియు జాతీయ సంతాపం
ఈ రైలు ప్రమాద ఘటనపై స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి అప్రమత్తమైంది. రైలులో ప్రయాణించిన భారతీయులకోసం లేదా వారి కుటుంబ సభ్యుల సహాయార్థం ప్రత్యేకంగా ఒక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, ఈ భారీ ప్రాణనష్టంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాష్ట సానుభూతి తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Epaper: epaper.vaartha.com

