Drone attack in Sudan : సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మరోసారి సామాన్య ప్రజల ప్రాణాలను బలిగొంది. సౌత్ డార్ఫర్ ప్రాంతంలోని నైలా మార్కెట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
సోమవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో మరో 113 మంది గాయపడినట్లు సమాచారం. మార్కెట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడితో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. గాయపడిన వారికి చికిత్స అందించడం, బాధితులను గుర్తించడం వంటి చర్యలు కీలకంగా మారాయి.
సూడాన్ సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య అధికార మార్పిడి, సైనిక బలగాల విలీనం వంటి అంశాలపై నెలకొన్న విభేదాలు సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీశాయి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలు పేలుడు పదార్థాలను మోసుకెళ్లే డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తాజా దాడి పౌరుల భద్రతపై ఆందోళనలను మరింత పెంచింది.

