Harish Rao: తనను వ్యక్తిగతంగా విమర్శించారనే కక్షతోనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
మరి అదే కోణంలో చూస్తే, 22ఏ నిషేధిత భూముల పేరిట రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ ఇల్లు సరే, పేదల భూముల మాటేమిటి?
సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే, కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూనే సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్వయంగా సీఎం ఇల్లే 22ఏ పరిధిలో ఉండగా, తన ఇల్లు జాబితాలోకి రాగానే రాత్రికి రాత్రే ఆంక్షలు తొలగించుకున్న రేవంత్.. పేదల భూముల విషయానికి వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే 42 వేలకు పైగా ఎకరాల పట్టా భూములు బందీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao: అసెంబ్లీ ముట్టడిస్తాం: బేషరతు క్షమాపణ చెప్పాలి
ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితాలోని పేదల భూములను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. భూ సమస్యలపై ప్రశ్నిస్తున్న రైతులను కబ్జాదారులుగా సంబోధించి అవమానించిన సీఎం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ వల్ల బ్యాంకు రుణాలు రాక రైతులు అల్లాడిపోతున్నారని, ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక కబ్జాల రాజ్యమా అని మండిపడ్డారు.

